● ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్
నందికొట్కూరు: పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీటి సరఫరా నిలిపేస్తే ఎలా అంటూ కేసీ ఆయకట్టు రైతులు అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద మల్యాల, శాతనకోట రైతులు ఆందోళన చేపట్టారు. ఓ వైపు హంద్రీ నీవాకు నీటిని విడుదల చేస్తున్నా అధికారులు కేసీ కెనాల్‌కు ఎందుకు నిలుపుదల చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందన్నారు. కేసీ కెనాల్ కింద మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ పంటలు సాగు చేశామని, మొక్కజొన్న కంకులు గింజ పడుతున్న సమయంలో సాగునీరు వెంటనే అందించకపోతే ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో ఆందోళన చేపడితే రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పి మోసం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పంటలకు సాగు నీరు అందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ మల్యాల, శాతనకోట రైతులు గోవిందు, నాగరాజు, షాలు, రషీదు, నరసింహ, అబ్దుల్ రహిమాన్, గోకారి, షేక్షావలి, వెంకటరెడ్డి, చిన్నన్న, మౌలాలి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, బిచ్చన్న, ఆంజనేయులు, శేఖర్, వెంకటేశ్వర్లు, ఠాగూరు నాయక్, రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.


