పచ్చ చొక్కా శాసిస్తోంది.. పోలీసులు పాటిస్తున్నారు!
పోలీసులంటే ప్రజల శాంతిభద్రత పరిరక్షణలో ముందుండాలి. పని చేసే చోట ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల నుంచి ఏదైన సందర్భాల్లో అంతో ఇంతో ఒత్తిళ్లు ఉంటాయి. అయితే విధులను సైతం అడ్డుకునేంత స్థాయిలో ఉండవనేది అందరికీ తెలిసిందే. ఆ మేరకు కొన్ని కేసుల్లో పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. డోన్‌లో మాత్రం అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అంటున్నారు. ఎంతలా అంటే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పందే స్టేషన్ గడప కూడా దాటరు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న పోలీసులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారనేందుకు డోన్‌లో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. తాజాగా సోషల్ రెస్పాన్సిబులిటీ కింద భారతి సిమెంట్ యాజమాన్యం డోన్ అర్బన్ పోలీసు స్టేషన్‌కు కేటాయించిన 23 బారికేడ్లను స్వీకరించేందుకు పోలీసు అధికారులు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు పోలీసుస్టేషన్ ఆవరణలో బారికేడ్ల పెట్టేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వాటిని వినియోగించకుండా రాత్రికి రాత్రే ఫైర్ స్టేషన్ ఆవరణలోని చెట్ల మధ్య ఎవరూ చూడని ప్రాంతానికి తరలించారు. ఎక్కడైనా సామాజిక బాధ్యతతో అందజేసే విరాళాలను రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా సహృదయంతో స్వీకరించాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ నేతల సూచనలతో పోలీసు అధికారులు మాత్రం భారతి సిమెంట్ కంపెనీపై వివక్ష చూపుతుండటం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసు అధికారులు బారికేడ్ల అందజేతను రాజకీయ కోణంలో చూడకుండా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేస్తే సమంజసంగా ఉంటుందని స్థానికులు పోలీసులకు సూచిస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసు అధికారిని వివరణ కోరగా, సమయం వచ్చినప్పుడు వాటిని వినియోగిస్తామని తెలిపారు. – డోన్


