రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

కోసిగి: మండల పరిధిలోని కోసిగి– సజ్జలగూడెం గ్రామ రోడ్డులో ఆర్టీసీ బస్సు–బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉండే కంపాటి శ్రీనివాసులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడైన కంపాటి నరసింహులు (16) కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 5వ తేది పెద్దనాన్న కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ ఉంది. శుక్రవారం బడికి సెలవు ఉండటంతో సజ్జలగుడ్డంలోని బంధువులను శుభకార్యానికి పిలిచేందుకు పెద్దనాన్న కుమారుడు విజయ్‌గోపాల్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు. ఆదోని డిపోకు చెందిన ఐరన్‌గల్లు బస్సు సజ్జలగుడ్డం గ్రామం మీదుగా కోసిగి వైపు వేగంగా వస్తుంది. నాగదేవతల కట్ట వద్ద మలుపులో బస్సును తప్పించబోయి బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న విజయ్‌గోపాల్‌ బస్సు తప్పించబోయి స్కిడ్‌ అయి ఎడమవైపు రోడ్డు దిగువ భాగంలో పడిపోయాడు. వెనుక కూర్చున్న నరసింహులు రోడ్డు పై పడడంతో బస్సు టైర్‌ ఆ విద్యార్థిపై ఎక్కింది. ఈ ఘటనలో ఈ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న విజయ్‌గోపాల్‌ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో బోరున విలపించారు. బాలుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement