బోరుకు తాళం తొలగింపు | - | Sakshi
Sakshi News home page

బోరుకు తాళం తొలగింపు

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంప్‌నకు ఓ వ్యక్తి వేసిన తాళాన్ని పోలీసులు తొలగించారు. ‘చేతి పంప్‌ బోర్‌కు తాళం’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర స్పందించారు. శుక్రవారం సిబ్బందితో ఎస్‌ఐ వెళ్లి వివరాలు తెలుసుకుని తాళాన్ని తొలగించారు. కాగా బోరు వద్ద బండలు పగిలిపోవడం వలన తాళం వేసినట్లు సమీపంలో నివాసముంటున్న వేణు భార్య రాజమ్మ పోలీసుల దృష్టికి తెచ్చారు. గతంలో ఇదే బోరుకు ప్రత్యేక మోటార్‌ అమర్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయగా ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకున్నారు.

దళితుల ఆత్మ గౌరవంపై దాడి

కోవెలకుంట్ల: నర్సీపట్నంలో డప్పుకొడుతున్న దళితుడిపై అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం వారి ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయక్‌ విమర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికార దర్పంతో దళితులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనలో దళిత భాస్కర్‌రావును స్పీకర్‌ దుర్భాషలాడి దాడి చేసిన తీరు మరింత ఆవేదన కల్గిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నాయన్నారు. అధికార మదంతో ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల గౌరవాన్ని కించపరిచేలా చోటు చేసుకున్న ఘటనకు బాధ్యత వహించి స్పీకర్‌ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దళిత సమాజం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడతామని హెచ్చరించారు.

మూడు గడివాములు దగ్ధం

కల్లూరు: దొడ్డిపాడు గ్రామంలో శుక్రవారం మూడు గడివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు చిన్న చాంద్‌ బాషా పశువుల మేత కోసం రెండు వేరుశనగ, ఒక సొప్ప వాము వేసుకున్నాడు. ప్రమాదవశాత్తూ గడివాములకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

దేవస్థానం ఉద్యోగి సస్పెన్షన్‌

మహానంది: మహానంది దేవస్థానంలో పనిచేస్తు న్న జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులును సస్పెన్షన్‌ చేస్తూ ఈఓ నల్లకాలువ శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని ఆలయ ఏఈఓ ఎరమల మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహించారని గుర్తించినట్లు చెప్పారు. విచారణ చేసిన ఈఓ శ్రీనివాస రెడ్డి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు.

ముగిసిన కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు

అవుకు (కొలిమిగుండ్ల): కునుకుంట్ల సమీపంలోని ఎర్రమల కొండల్లో వెలసిన సద్దలక్ష్మి సమేత లక్ష్మీకంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఏప్రిల్‌ 29న ప్రారంభమైన ఈ వేడుకల్లో మూడు రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు పూర్ణాహుతి, వసంతోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తుల సమక్షంలో పారువేట ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement