పడిపోయిన టమాట ధర | - | Sakshi
Sakshi News home page

పడిపోయిన టమాట ధర

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

పెద్దకడబూరు: టమాట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌లో మూడుకిలలో ధర రూ.4 పలుకుతోంది. దీంతో పెద్దకడబూరులోని సోమన్నాచారి అనే రైతు తన రెండు ఎకరాల్లో టమాట కాయలను తెంపకుండా అలాగే వదిలేశారు. రెండు ఎకరాల్లో టమాట ను రూ.1.50లక్షల ఖర్చుపెట్టి సాగు చేశానని, మొక్కలకు పందిరి వేసినా దిగుబడికి ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో కిలోకు రూ. 2 ధర కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.

అపరిచితులతో డిజిటల్‌ లావాదేవీలు చేయొద్దు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు: అపరిచితులు, తెలియని వ్యక్తులతో డిజిటల్‌ లావాదేవీలు చేయొద్దని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ జిల్లా ప్రజలకు సూచించారు. ఏటీఎంల వద్ద అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేయరాదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ‘అత్యవసరం ఉందని, నగదు ఇస్తాం.. ఫోన్‌పే, గూగుల్‌ పే చేయండి.. మేం ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తాం.. మాకు నగదు డబ్బులివ్వండి’ అని అపరిచిత వ్యక్తులు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఏటీఎంలు, బ్యాంకుల ద్వారానే ప్రజలు నేరుగా లావాదేవీలు జరుపుకోవాలి తప్ప అపరిచితులను నమ్మి డిజిటల్‌ లావాదేవీలు జరపరాదని సూచించారు. తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులిచ్చి డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురై ఉంటే 1930 సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

రహదారులు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి

కృష్ణగిరి: రహదారులు బాగుండి, రవాణా సౌకర్యం పెరిగినప్పుడే గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ విజయకుమారి అన్నారు. వెల్దుర్తి క్రాస్‌ నుంచి టి.గోకులపాడు, తొగర్చేడు గ్రామాలకు ఇటీవల నాబార్డు నిధులతో వేసిన బీటీ రహదారులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. టి.గోకులపాడు గ్రామ సమీపాన హంద్రీపై బ్రిడ్జి, కటారుకొండ క్రాస్‌ రహదారి నుంచి పులిచెర్లకు బీటీ రహదారికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఈమె వెంట పీఆర్‌ ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈ శేషయ్య, క్వాలిటీ కంట్రోల్‌ డీఈఽ దనిబాబు, మండల పీఆర్‌ ఏఈ జాకీర్‌హుసేన్‌ ఉన్నారు.

ఎల్లెల్సీకి నీటి విడుదల

హొళగుంద: వేసవిలో ప్రజల గొంతులు తడిపేందుకు తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. డ్యాం నుంచి పవర్‌ కెనాల్‌కు విడుదలైన 1,500 క్యూసెక్కులు నీరు గుండ్లకెరె (చెరువు)కు చేరి అక్కడ నుంచి ఎల్లెల్సీకి విడుదలవుతున్నాయి. ప్రస్తుతం వదిలిన నీరు మరో మూడు రోజుల్లో ఆంధ్ర (250 కి.మీ)కు చేరనున్నాయి. దాదాపు 15 రోజుల పాటు నీటిని వదిలి మళ్లీ ఈ నెల 18 లేదంటే 20వ తేదీకి నిలిపివేయనున్నారు. టీబీ డ్యాం పూర్తి స్థామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.121 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నాయి.

ఇక భానుడి భగభగలే!

కర్నూలు(అగ్రికల్చర్‌): రానున్న నాలుగు రోజులు జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ వరకు పొడి వాతావరణం( డ్రై వెదర్‌) ఉంటుందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement