‘మావిగన్‌’తో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

‘మావిగన్‌’తో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

కర్నూలు (టౌన్‌): మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్‌) ప్రాంతాల్లోని 110 కిలోమీటర్ల పరిధిలో రూ.20 వేల కోట్ల ఖర్చుతో రాజధానిని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మావిగన్‌ ప్రతిపాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ అమరావతికి వైఎస్సార్‌సీపీ ఏనాడూ వ్యతిరేకం కాదన్నారు. 2014 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఎందుకు అమరావతిలో ఇల్లు నిర్మించుకోలేదన్నారు. ఇప్పటికీ చుట్టపు చూపుగా షాడో సీఎం నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి వచ్చి పోతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇప్పటికే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చదరపు అడుగుకు రూ.4 నుంచి రూ.6 వేలు ఖర్చు అవడం లేదని... అమరావతి నిర్మాణంలో మాత్రం చదరపు అడుగుకు రూ.12 వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నా ఈ ప్రభుత్వం అక్కడ ఎందుకు ఏ ఒక్క నిర్మాణమూ చేపట్టలేదని ప్రశ్నించారు. మళ్లీ 50 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని... మొత్తంగా లక్ష ఎకరాలో అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.లక్షల కోట్లు దోపీడీ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందన్నారు.

ఏడేళ్ల సీఎం హోదాలో ఒక్క శాశ్వత బిల్డింగ్‌ కట్టారా?

అమరావతి రాజధాని అని పదే పదే చెబుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండో సారి ముఖ్యమంత్రిగా ఏడేళ్లు పూర్తి అవుతున్నా ఎందుకు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తుప్పలు తొలగించడానికి, వరద నీరు ఎత్తి పోయడానికి, తాత్కాలిక భవనాలకు కోట్లు ఖర్చు చేశారన్నారు. గ్రోత్‌ ఇంజిన్‌ లేని ప్రాంతంలో రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం కన్నా... అందులో 10 శాతం నిధులు మావిగన్‌ కోసం ఖర్చు చేస్తే సంపద సృష్టించవచ్చన్నారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) పేరుతో పక్కా వ్యాపారం తప్ప... భూములిచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ప్లాన్‌ బి మావిగన్‌పై దృష్టి సారించాలని సూచించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఇప్పటికే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు చేసినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సంపద సృష్టి అంటే వేల కోట్లు అప్పులు చేయడమేనా అని ఎస్వీ ప్రశ్నించారు. సమావేశంలో ఎస్వీ విజయ మనోహరి, నరసింహులు యాదవ్‌ పాల్గొన్నారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

ప్రతిపాదనలకు ప్రజల నుంచి

మంచి స్పందన

వైఎస్సార్‌సీపీ కర్నూలు అధ్యక్షుడు

ఎస్వీ మోహన్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement