‘సహకార’ విజేత కర్నూలు
కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) సహకార ఉత్సవ్ 3.0 పేరుతో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్ర బ్యాంకు టీం అద్భుతమైన ప్రతిభ కనపరిచింది. విజయవాడలో జరిగిన పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకుల టీములతో పాటు నాబార్డు, ఆర్‌సీఎస్, ఆప్కాబ్ టీములు కలిపి మొత్తంగా 16 టీములు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా టీం అద్భుతంగా రాణించి ఛాంపియన్‌గా నిలిచింది. సహకార ఉత్సవ్ 3.0 క్రికెట్ పోటీల్లో కప్పును ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణయ్య చేతుల మీదుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ పి.రామాంజినేయులు, టీం కెప్టెన్ విజయసింహా రెడ్డి అందుకున్నారు. సహకార ఉత్సవ్ 3.0 విజేత అయిన కర్నూలు టీం సభ్యులను ఆప్కాబ్ ఎండీ రామకృష్ణయ్య, కర్నూలు డీసీసీబీ సీఈఓ రామాంజినేయులు అభినందించారు. కర్నూలు టీమ్‌లో ఎస్.విజయసింహా రెడ్డి, బి.నారాయణరెడ్డి, ఎస్.సొహైల్, జి.శ్రీనివాసులు, పులి సాయిప్రసాద్, టి.శంకర్, బి.సుకుమార్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, ఎల్.రవికుమార్ రెడ్డి, టి.మనోజ్, ఎన్.వీర మహేష్ ఉన్నారు.


