ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
● రూ.2.93 లక్షల ఎరువులపై స్టాప్‌సేల్స్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరంలోని వివిధ ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. కల్లూరు మండల వ్యవసాయ అధికారి పరిధిలోని సాయికృప ఏజెన్సీస్, విజయలక్ష్మి ఏజెన్సీస్, కర్నూలు మండల పరిధిలోని మన గ్రోమర్ సెంటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా యూరియా స్టాక్ వివరాలు, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. ఈ–పాస్‌లో ఉన్న స్టాక్, షాపులో ఫిజికల్‌గా ఉన్న స్టాకు వివరాలను తనిఖీ చేశారు. సాయికృప ఏజెన్సీస్‌లో సోర్స్ సర్టిఫికెట్ ఓ పామ్‌లో ఇంక్లాజన్ కానందున రూ. 2.93 లక్షల విలువ కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. ప్రయివేటు డీలర్ షాపుల్లో యూరియా లేదు. మన గ్రోమర్ సెంటరులో ఇంతవరకు ఎంత యూరియా వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు.. స్టాక్ ఎంత ఉందనే వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... యూరియాతో సహా ఎరువులకు సంబంధించిన రికార్డులు పకడ్బందీగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో కర్నూలు ఏడీఏ ఎన్.సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


