బోనోఫిక్స్ అక్రమంగా రవాణా చేస్తూ..
● పోలీసుల అదుపులో బాలుడు
పాములపాడు: ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ బాలుడు కర్నూలు నుంచి మత్తు పదార్థంగా వినియోగించే బోనోఫిక్స్‌ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కరివేనకు చెందిన బాలుడు ఈనెల 27వ తేదీ రాత్రి మిత్రుడి (మైనర్)తో కలసి కర్నూలు నుంచి స్వగ్రామానికి బోనోఫిక్స్‌ను అక్రమంగా బైక్‌పై తరలిస్తూ మార్గమధ్యలో యర్రగూడూరు వద్ద నిలిచారు. స్థానిక సీపీడబ్ల్యూ స్కీం వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్‌మెన్ చాకలి వెంకటేశ్వర్లు వారిని గమనించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని మందలించాడు. మత్తులో ఉన్న ఇద్దరు మైనర్లు ఆగ్రహంతో వాచ్‌మెన్‌పై దాడి చేసి గాయపరిచారు. వాచ్‌మెన్ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా సుమారు 20కి పైగా బోనోఫిక్స్ ట్యూబ్‌లు ఉండటంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఎవరికీ ఇచ్చేందుకు వెళ్తున్నాడని విచారణ చేపట్టామన్నారు. మైనర్ కావడంతో మందలించి తల్లిదండ్రులకు అప్పగించామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.


