30న దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(అర్బన్): మూడు చక్రాల మోటారు వాహనాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల సర్టిఫికెట్లను ఈ నెల 30న కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పరిశీలించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రయిస్‌ఫాతిమా తెలిపారు. కార్యక్రమానికి కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దరఖాస్తుదారులు మాత్రమే హాజరు కావాలని ఆమె శనివారం ఒక ప్రకటన లో కోరారు. జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన చేపడతామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ ధృవపత్రాలను తీసుకురావాలని పేర్కొన్నారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కోడుమూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ సుధాకర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం సాయంత్రం డీఈఓ కోడుమూరులోని బాలురు, బాలికల హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా హైస్కూళ్లలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు. డీఈఓ ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి స్వయంగా సమాధానాలు రాబట్టారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులంతా ప్రతి రోజు ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జయరామచంద్రుడు, హెచ్‌ఎం రామచంద్రుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కర్నూలుకు 80 టన్నుల గోధుమ పిండి
కర్నూలు(సెంట్రల్): జిల్లాకు 80 టన్నుల చెక్కీ ఆట గోధుమ పండిని కేటాయించినట్లు సివిల్ సప్‌లై డీఎం వెంకటరాముడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ గోధుమ పిండిని కర్నూలు నగరంలోని రేషన్ కార్డుదారులకు మాత్రమే అందజేస్తామన్నారు. కార్డుకు కేజీ చొప్పున కేటాయిస్తామని, ప్రత్యేక ప్యాకింగ్‌లో వచ్చిన గోధుమ పండి కోసం రూ.20 వసూలు చేస్తామన్నారు.
రౌడీషీటర్ తులసికుమార్ జిల్లా బహిష్కరణ
కర్నూలు: కర్నూలు నాలు గో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్‌లో నివాసముంటున్న కిరాయి హంతకుడు వడ్డె రామాంజినేయులు పెద్ద కుమారుడైన రౌడీషీటర్ వడ్డె తులసి కుమార్ (షీట్ నెం.389)పై జిల్లా కలెక్టర్ ఏ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశా రు. ఇతను ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా రకరకాల కేసుల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనలతో క్రిమినల్ రికార్డులు పరిశీలించి కలెక్టర్ శనివారం ఇతనిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈయన తండ్రి వడ్డె రామాంజినేయులు అలియాస్ వడ్డె అంజి, అదే కాలనీలో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్ ఖాన్‌పై కూడా ఈనెల 11న జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ కావడంతో జైలు జీవితం గడుపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అల వాటు పడిన మరో 15 మంది పేర్లు కూడా జిల్లా బహిష్కరణ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
30న దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన


