ఆయకట్టు రైతుకు ఇక కన్నీరే!
కర్నూలు సిటీ: రబీలో సాగయ్యే ఆయకట్టుకు తుంగభద్ర డ్యాం నుంచి సాగునీరు అందే పరిస్థితులు లేవు. ప్రస్తుతం డ్యాం పాత గేట్ల ఎలిమెంట్స్‌ను తొలగిస్తున్నారు. కొత్త గేట్ల పనులు మొదలు పెట్టేందుకు పది రోజులుగా నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ నీరంతా నదీ తీరంలోని గ్రామాలకు, పంట పొలాలకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. వృథాగా దిగువకు వెళ్తున్నాయి. ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు ఎలాంటి రిజర్వాయర్లు లేవు. టీబీ డ్యాంలో పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41.508 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ఏమీ లేకపోగా 8,752 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలు, అలగనూరు రిజర్వాయర్ సామర్థ్యం 2.65 టీఎంసీలు. సుంకేసుల బ్యారేజీ నీరంతా కర్నూలు నగరపాలక సంస్థ తాగు నీటి అవసరాలకు సైతం సరిపోని పరిస్థితులు ఉన్నాయి. అలగనూరు రిజర్వాయర్ కట్టలు కుంగిపోవడంతో ఎనిమిదేళ్లుగా నీటిని నిల్వ చేయడం లేదు. మరమ్మతులు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పి 18 నెలలు అవుతున్నా పట్టించుకోలేదు. కేవలం మట్టి పరీక్షలకే పరిమితం అయ్యింది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది వర్షాకాలం వరకు తుంగభద్రలో నీటి ప్రవాహం ఉండదు. టీబీ డ్యాంలో నుంచి నీటి విడుదల బంద్ చేయడంతో వారం పది రోజుల వరకు మాత్రమే కేసీకి నీటి విడుదల ఉంటుంది. ఆ తరువాత నీటిని బంద్ చేయనున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి కేసీకి నీటి విడుదల చేసే అంశంపై ఇప్పటి వరకు జల వనరుల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
రబీలో టీబీ డ్యాం నుంచి
అందని సాగు నీరు
గేట్ల మరమ్మతులతో
దిగువకు వెళ్తున్న నీరు
అలగనూరు రిజర్వాయర్‌ను
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం


