క్రీడా హాస్టళ్లను తరలిస్తుంటే నోరు మెదపరేం
కర్నూలు(టౌన్): కర్నూలులో సాయి(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) హాస్టళ్లను తరలించుకుపోతే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. క్రీడలను ఉద్దరిస్తామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఉన్న హాస్టళ్లను తరలిస్తుంటే కర్నూలును స్పోర్ట్స్ సిటీగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం స్థానిక స్పోర్ట్స్’ అథారిటీ స్టేడియం వద్ద సాయి హాస్టల్‌ను తరలించకూడదంటూ క్రీడాకారులు, క్రీడా సంఘాలు, క్రీడా సంఘాల ప్రతినిధులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయి హాస్టల్‌ను తిరుపతికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, పిల్ వేసి అడ్డుకుంటామన్నారు. కర్నూలు తలమానికంగా ఉన్న సాయి హాస్టల్‌ను తరలిస్తుంటే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీమ ప్రాంతం అభివృద్ధి దృష్ట్యా గత ప్రభుత్వం ఒకప్పటి రాజధాని కర్నూలులో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు. చిన్న మరమ్మతులను సాకుగా చూపి స్పోర్ట్స్ హాస్టల్‌ను కుట్రతో తిరుపతికి తరలించాలనుకోవడం తగదన్నారు. ఈ విషయంలో న్యాయం చేయకపోతే క్రీడాకారులతో కలిసి ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు బైఠాయిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు, క్రీడా సంఘాల ప్రతినిధులు నాగరత్నమయ్య, నరేంద్ర ఆచారి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


