గంజాయి సాగు చేస్తే శిక్ష తప్పదు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి సాగు చేసినా, పట్టుబడిననా చట్ట ప్రకారం శిక్ష తప్పదని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కనీసం మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్, ఎస్పీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్‌లు గంజాయి సాగుపై గట్టి నిఘా ఉంచాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో గంజాయి సాగుతో కలిగే దుష్పరిమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారి వరలక్ష్మీని ఆదేశించారు. డి అడిక్షన్ సెంటర్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మాట్లాడుతూ కాలేజీలు, పాఠశాలల్లో మత్తు పదార్థాలను తీసుకోకూడదనే సందేశంతో హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు గంజాయి సమాచారం ఉంటే ఇవ్వాలన్నారు. సమావేశంలో ఈగల్ టీం సభ్యులు సృజన్ కుమార్, ఎకై ్సజ్ డీసీ సుధీర్‌బాబు, ఆర్‌టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ భాస్కర్, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధిక, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబీహాపర్విన్ పాల్గొన్నారు.


