మహానందిలో షాపుల వేలాలు వాయిదా
మహానంది: మహానందిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న 17 షాపులకు సంబంధించిన బహిరంగ వేలాలు వాయిదా పడ్డాయి. మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో మంగళవారం బహిరంగ, సీల్డు టెండర్లు నిర్వహిచారు. దేవస్థానం ప్రాంగణంలోని షాపింగ్ కాంపెక్స్‌లో ఉన్న 17 షాపులకు వేలాలు జరగగా కొందరు స్థానిక వ్యాపారులు డిపాజిట్లు చెల్లించారు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని మొగ్గు చూపకపోవడంతో వాయిదా వేశారు. ఇదిలా ఉండగా జేఎస్‌డబ్ల్యూ వాటర్‌ప్లాంట్ ముందున్న రెండు ఖాళీస్థలాలను గతంలో అప్పటి అధికారులు గిరిజన , చెంచుల ఉత్పత్తుల విక్రయం కోసం కేటాయించారు. అయితే అధికారులు వాటికి నిర్వహించిన వేలాలు పోటాపోటీగా జరిగాయి. వీటిలో 43వ నెంబరుకు రూ. 30వేలు, 44 నెంబరు దుకాణానికి నెలకు రూ. 29వేలు ప్రకారం స్థానిక వ్యాపారులు వేలం పాడారు.
అనుకున్నట్లే అయింది
మహానంది షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపుల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఇటీవల తిమ్మాపురం ఏపీ మోడల్ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని కలిశారు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఓ అధికార పార్టీ కీలక నేత రెండు మూడు సార్లు వాయిదా పడేలా చూడండి, తర్వాత మేం చేసేది చేస్తామని ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో మంగళవారం నిర్వహించిన వేలాల్లో వ్యాపారులు అదే సూత్రం పాటించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఆలయ ఆదాయానికి అధికార పార్టీ నేతలు గండికొడుతుండటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


