ఆహార విక్రయ వ్యాపారులకు జరిమానా
కర్నూలు(హాస్పిటల్): తినేందుకు పనికిరాని, నాణ్యతలేని ఆహారాలను విక్రయించినందుకు గాను పలువురు వ్యాపారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు జరిమానా విధించారు. ఫుట్ సేఫ్టీ ఆఫీసర్ ఇటీవల ఆహార తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపించారు. వాటి నివేదికల ఆధారంగా వ్యాపారులకు ఫైన్ వేశారు. ఇందులో కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన శ్రీ సత్యసాయి ఏజెన్సీ వారికి రూ.50 వేలు, అమీన్ అబ్బాస్‌నగర్‌లోని శ్రీ కామధేను హోటల్ వారికి రూ. 25వేలు, పాత కంట్రోల్‌రూమ్ వద్ద మండి రెస్టారెంట్ వారికి రూ.50వేలు, మంత్రాలయంకు రూ.25వేలు, ఆదోనిలోని న్యూ సోనమ్ హిల్స్‌కు రూ.25 వేలు, ఎమ్మిగనూరులోని వ్యాపారికి రూ.10వేలు జరిమానా విఽధించారు. దీంతో పాటు వివిధ హోటల్స్‌లో కల్తీ వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై వివిధ కోర్టుల్లో 12 కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తెలిపారు.
రక్తదాతకు అభినందన
కర్నూలు: రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడం లాంటిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చిన్నసుంకన్న 50 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఆయనను శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ బాబుప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


