విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కరెంటోళ్ల జనబాట కార్యక్రమం
ప్రారంభోత్సవంలో ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్‌సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అన్నారు.మంగళవారం ఆయన ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 37 సెక్షన్‌లు ఉండగా.. 26 గ్రామాలు, కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లోని 11 వార్డుల్లో ఈ కార్యక్రమం జరిగింది. కల్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఈ పాల్గొని మాట్లాడారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 11కేవీ, ఎల్‌టీ, వ్యవసాయ విద్యుత్ లైన్‌ల పరిశీలన, కిందకు వేలాడే విద్యుత్ తీగలను సరిచేయడం. వాలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి.. మార్చడం, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్సఫార్మర్ల దిమ్మెల ఎత్తును పెంచడం లేదా ఫెన్షింగ్ ఏర్పాటు తదితర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఈఈ టెక్నికల్ మహేశ్వరరెడ్డి, కమర్షియల్ డీఈఈ విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


