గ్రామీణ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు
● మిస్సెస్ ఇండియా–2025 విజేత
కవ్వం విజయలక్ష్మీ
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంత మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ఆ విషయాన్ని నిరూపించడం కోసమే తాను మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించినట్లు మిస్సెస్ ఇండియా–2025 విజేత కవ్వం విజయలక్ష్మీ తెలిపారు. ఇటీవలే కిరిటీం గెలుచుకున్న నేపథ్యంలో తన సన్నిహితులు, బంధువుల ఆహ్వానం మేరకు ఆమె కర్నూలు వచ్చారు. అందులో భాగంగా తన స్నేహితురాలు ఐపీఎస్ అధికారి చౌడేశ్వరితో మర్యాదపూర్వక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనది రాయచోటి అన్నమయ్య జిల్లా ఇందన్నహాన్ గ్రామమని, అమ్మానాన్న వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వారన్నారు. వెనుకబడిన రాయలసీమకు చెందిన తనకు గ్రామీణ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనే కోరిక ఉండడంతో మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. అందాల పోటీలు అంటే కేవలం అందానికి సంబంధించిన విషయమని కాదని.. అందంగా లేకున్నా సాధించాలన్న కృష్టి, పట్టుదల ఉంటే తనలా ఎవరైనా విజయం సాధించవచ్చని చెప్పారు.


