మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
కృష్ణగిరి: లాల్‌మాన్‌పల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం.. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థుల్లో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి 47 మంది విద్యార్థులకు గాను 45 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం అన్నం, వంకాయ కూర, గుడ్డు, చిక్కి వడ్డించారు. భోజనం చేసిన తర్వాత 3, 4, 5వ తరగతులకు చెందిన విక్రమ్, నితిన్ కుమార్, మేఘమాల, జాఫ్రిన్, ఉమేర, రవళిక తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వినోద్‌కుమార్, ఉపాధ్యా యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. తక్షణం స్పందించిన ఎంపీడీఓ మోహన్ కుమార్, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి వరప్రసాద్, ఎంఈఓ–1 సునంద, ఎంఈఓ–2 మైఖేల్ వెంటనే పాఠశాలకు వెళ్లి విచారించారు. వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది వాంతులు, కడుపునొప్పికి గురైన విద్యార్థుల ను పరీక్షించారు. పరీక్షలు, ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మధ్యాహ్న భోజనంకు సంబంధించి గుడ్డులో నాణ్యత లేకపోవడం, పాడుబడిన గుడ్డు తదితరాలే విద్యార్థుల అస్వస్థతకు కారణంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యా హ్న భోజనం అన్ని వంటల నమూనాలు సేకరించారు. నాణ్యత పరిశీలనకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే గుడ్ల సరఫరా సక్రమంగా లేకపోవడం, వారానికి ఒకసారి ఒక్కో కలర్‌తో కూడిన రంగు వేసిన తాజా గుడ్లు తీసుకురావాల్సి ఉండగా, రెండు, మూడు వారాలకి ఒకసారి గుడ్లు సరఫరా చేస్తుండడం, వంట ఏజెన్సీలు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వ్యవహరించడం కనిపిస్తోంది. జరిగిన సంఘటన సందర్భంగా పాఠశాల రికార్డులను, భోజన సామగ్రిని తనిఖీ చేసిన ఎంపీడీఓ మాట్లాడుతూ ఏకంగా గుడ్లు రంగు లేకుండా ఉండడంపై విచారించారు. ఇది ఎంఈఓ–1 నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోందన్నారు.
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత


