ఫ్లోర్ బాల్ విజేతకు కలెక్టర్ అభినందన
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో విజేతగా నిలిచిన పెద్దపాడు చిల్డ్రన్స్ హోమ్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం.వెంకటలక్ష్మీని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అభినందించారు. సోమవారం కలెక్టర్ ఆ బాలికను పిలిపించుకొని అభినందనలు తెలిపారు. అంతేకాక ఆ బాలికకు సెయిట్ జీసస్ స్పోర్ట్స్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్ చారిటబుల్ ట్రస్టు ఇచ్చిన రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలికకు శాలువ కప్పి సన్మానం చేశారు.
మార్కెట్ యార్డులో కాటాల తనిఖీ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో సెక్రటరీ జయలక్ష్మి అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ... కాటాలు జరుగుతున్నపుడు రైతులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాటాలు జరుగుతున్న సమయంలో రైతులు పక్కకు వెళ్లరాదని, తూకాలు సక్రమంగా ఉంటున్నాయా అనే దానిపైనే నిఘా ఉండాలని పేర్కొన్నారు. తూకాలు పక్కాగా ఉండాలని, రైతులను దగా చేయడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న పరిశ్రమలతో ఇతరులకు జీవనోపాధి ఇవ్వాలి
● సెర్ప్ అడిషినల్ సీఈఓ శ్రీరాములు
పాణ్యం: ప్రతి మహిళా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇతరులకు జీవనోపాధి కల్పించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అడిషినల్ సీఈఓ శ్రీరాములు నాయుడు తెలిపారు. పాణ్యంలో మండల సమాఖ్యలో జీవనోపాధులు పొందిన మహిళలలతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాల సమాఖ్యలు, సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ తనిఖీ చేశారు. అనంతరం ఓబీఓల, వీవోఓలతో సమీక్ష నిర్వహించారు. నంద్యాల డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతంగా ఉండడానికి పాణ్యం సమాఖ్య ఒక నిదర్శమన్నారు. ప్రాజెక్టు మెనేజర్లు రంగరావు, నాయక్, సురేష్, బాబురావు, నంద్యాల ఏరియా కో–ఆర్డినేటర్ ప్రసాద్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కామాక్షమ్మ, సీసీలు రఘు రామ్, పుల్లన్న, బాలస్వామి, మేరీ పాల్గొన్నారు.
పిచ్చికుక్క దాడి
చాగలమర్రి(ఆళ్లగడ్డ): పట్టణంలోని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో సోమవారం సాయంత్రం పిచ్చికుక్క హల్‌చల్ చేసింది. కార్యాలయంలో విధు లు నిర్వహిస్తున్న సినియర్ అసిస్టెంట్ షంషుద్దీన్‌పై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన షంషుద్దీన్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క కార్యాలయంలోనే తిష్ట వేసింది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే పిచ్చికుక్కను బంధించి చంపేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ్లోర్ బాల్ విజేతకు కలెక్టర్ అభినందన


