టీడీపీ నాయకుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయండి
కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం కల్లూరు సర్వే నంబర్ 292లో 1985లో వేసిన ప్లాట్లను అక్రమంగా ఆక్రమించుకున్న టీడీపీ నాయకుడు జనార్దన్ ఆచారి బారి నుంచి విముక్తి కల్పించాలని బాధితులు రోడ్డెక్కారు. ఆయనకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతో పోలీసు స్టేషన్‌లో కనీసం కేసు కూడా నమోదు చేయడంలేదని, కో ర్టు తీర్పును కూడా ధిక్కరించి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. సోమవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. వెంటనే టీడీపీ నాయకుడు జనార్దన్ ఆచారి, అతని అనుచరులు తెలుగు మహేష్, వడ్డే నాగేశ్వరరావు, దేవేంద్ర ఆచారిలపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు రాజయ్య, రాముడు, సుంకన్న మాట్లాడుతూ.. సర్వే నంబర్ 292లో 3.95 ఎకరాల భూమి ఉందని, దానిలో 35 సెంట్లలో 1985లో మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకొని ఎనిమిది మంది ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అంతేకాక మిగతా స్థలంలో 38 మంది బాధితులు అప్రూవుడ్ లేవుట్‌లో ప్లాట్లను కొనుగోలు చేశారని చెప్పారు. ఈ క్రమంలో 40 ఏళ్ల తరువాత జనార్దన్ ఆచారి ఆ పొలం తమ తాతది అంటూ ప్లాట్లదారులకు తెలియకుండా రాత్రికి రాత్రి ఉన్న రోడ్లు, కట్టిన ఇళ్లను కూల్చారని, ఈ విషయంపై తాము పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కోర్టు ఆర్డర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారన్నారు. ఈ క్రమంలో తాము కోర్టుకు వెళ్లి ఆ ఆర్డర్‌ను ఇటీవల రద్దు చేయించామన్నారు. ఈ క్రమంలో కోర్టును తీర్పును కూడా ధిక్కరించి తమను ప్లాట్లలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, వెంటనే అతన్ని ఖాళీ చేయించాలని కోరుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. దీంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, ఆయనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో పోలీసులు కూడా పట్టించుకోవడంలేదని, మునిసిపల్, రెవెన్యూ అధికారులు తమకు సంబంధంలేదని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకపోతే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
1985లో కొనుగోలు చేసిన ప్లాట్లను
స్వాధీనం చేసుకొని భయపెడుతున్నారు
కోర్టు ఆదేశాలను కూడా
ధిక్కరించి గుండాయిజం చేస్తున్నారు
కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన


