జల్సాలకు అలవాటు పడి చోరీలు
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
● చోరీ సొమ్ము స్వాధీనం
కోడుమూరు రూరల్: జల్సాలకు అలవాటు పడి ఇద్దరు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం కేసులను నమోదు చేసుకున్న కోడుమూరు పోలీసులు ఎట్టకేలకు చోరీలకు పాల్పడ్డ నిందితులను గుర్తించి చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు డీఎస్సీ బాబు ప్రసాద్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మండలంలోని ముడుమలగుర్తి గ్రామానికి చెందిన కురువ నాగేంద్ర అనే వ్యక్తి భార్యను వదిలేసి గత ఏడాది నుంచి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సమయంలో మూడు నెలల కిందట మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప అనే వ్యక్తిని పరిచయం చేసుకుని ఇద్దరు కలిసి తాళాలు వేసిన ఇండ్లను కనిపెట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. గత నవంబర్ 27న గోరంట్ల గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు కమ్మలు, వెండి కాళ్ల పట్టీలతో పాటు రూ.80వేల నగదును దొంగలించారు. ఈనెల 15న ముడుమలగుర్తి గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి రూ.6,13,000లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు కేసుల్లో నిందితులను కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి గుర్తించారు. ముడుమలగుర్తికి కురువ నాగేంద్రను సోమవారం కోడుమూరులోని తాత గుడి సమీపంలో అరెస్ట్ చేసి నగదు, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన గోరంట్లకు బోయ ఎల్లప్ప పరారీలో ఉన్నట్లు డీఎస్సీ బాబుప్రసాద్ తెలిపారు. దొంగతనం కేసులను త్వరగా ఛేదించిన ఎస్‌ఐ ఎర్రిస్వామి, సిబ్బందిని డీఎస్సీ బాబు ప్రసాద్, కోడుమూరు సీఐ తబ్రేజ్ అభినందించారు.


