కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతపై అవగాహన సదస్సు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సోమవారం న్యాయ సేవా సదన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించిన కార్పొరేట్ ఆర్గనైజేషన్ అధికారులు, పరిశ్రమల యజమానులు, బ్యాంకర్స్, లయన్స్ క్లబ్ నిర్వాహకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ... సీఎస్‌ఆర్ నిధులు అంటే కంపెనీలు తమ లాభాలలో కొంత భాగాన్ని సమాజం, పర్యావరణం, ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించే నిధులు అని తెలిపారు. దేశంలో కంపెనీల చట్టం 2013 ప్రకారం ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటి రంగాల్లో సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమేనన్నారు. లీగల్ సర్వీసెస్ సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో విభిన్న ప్రతిభావంతులకు, మానసిక వికలాంగులకు పేద పిల్లల సహాయార్థం వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహాయం చేయాలని సూచించారు. వికలాంగుల కోసం వీల్‌చైర్లు, చెవిటి పిల్లల కోసం చెవిటి మిషన్ల సరఫరా చేయాలని కోరారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవా కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని కార్పొరేట్ అధికారులు హామీ ఇచ్చారు. ఆల్కాలీస్ గ్రూప్ మేనేజర్లు, ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మేనేజర్లతో పాటు సిమెంటు ఫ్యాక్టరీ అధికారులు, లయన్స్ క్లబ్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


