కలెక్టరేట్‌లో పారిశుద్ధ్యం లేకుంటే ఎలా?
● ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని కారిడార్లలోనే తాగిన టీకప్పులు, తిన్న పేపర్‌ప్లేట్లు, ఇతర చెత్తను వేయడంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నా సిబ్బందిలో మార్పు రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలకు పరిశుభ్రత ను పాటించాలని ఎలా చెబుతామని ప్రశ్నించారు. కార్యాలయాలు, వాటి కారిడార్లలో పరిశుభ్రతను పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ టెర్రస్‌పై కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించా రు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ కలెక్టరేట్‌లోని కొన్ని కార్యాలయాలను ఆమె పరిశీలించారు. నేషనల్ హైవే కార్యాలయంలో రికార్డులు చెత్త కుప్ప మాదిరిగా ఉండడంతో వాటిని స్కాన్ చేసి ఈపీటీఏ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యశాలలో టాయిలెట్లు క్లీన్‌గా లేవని, అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేసే కిట్లు సరిగా లేవని ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు అక్కడి సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. అంతకముందు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి స్వచ్ఛంధ్రా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ,ఏఓ శివరాముడు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


