జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు దక్కింది. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్‌ఐలు ధనుంజయ, సునిల్‌తో పాటు సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నటేకూరు గ్రామ శివారులో ఈ ఏడాది ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రెండు ఏటీఎంలను ఎత్తుకెళ్లేందుకు దొంగలు ప్రయత్నించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఏటీఎంను దొంగలు పెకిలించి వాహనంలో తీసుకుపోతుండగా స్థానికులు అనుమానించి వెంటపడ్డారు. దీంతో దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించినందుకు జిల్లా పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది.


