నంద్యాలలో 22, 23న స్పోర్ట్స్ మీట్
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–2026 (ఐపీఎస్‌జీఎం) ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం వాల్‌పోస్టర్లను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్‌లో కర్నూలు నంద్యాల జిల్లాల నుంచి 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారన్నారు. వివరాల కోసం మార్గరెట్ (9390405721), నాగరాజు (9885037114) సంప్రదించాలన్నారు.
ఆన్‌లైన్ ఉద్యోగాలంటూ టోకరా
● రూ. 6 లక్షలు మోసపోయిన యువకులు
ఆదోని అర్బన్: పట్టణంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం రూ.6 లక్షలు మోసపోయారని వన్‌టౌన్ ఎస్‌ఐ సమీర్‌బాషా శుక్రవారం తెలపారు. ఎల్‌టీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆన్‌లైన్ ఉద్యోగాలు ఇస్తామంటూ విశాఖపట్నంకు చెందిన భానుప్రసాద్, లావణ్య ఆశ పెట్టారు. ఒక ఉద్యోగానికి ఒకటిన్నర లక్ష ఇస్తే ఉద్యోగం వస్తుందని ఆన్‌లైన్‌లో నమ్మ పలికారు. దీంతో రాజరాజేశ్వరి కాలనీకి చెందిన వీరేష్‌బాబుతో పాటు మరో ముగ్గురు ఒకటిన్నర లక్ష చొప్పున మొత్తం ఆరు లక్షలు ఆన్‌లైన్ ద్వారా వేశారు. 2024లో ఈ లావాదేవీలు జరిగాయని, తీరా ఉద్యోగం రాకపోవడంతో ఆన్‌లైన్‌లో, ఫోన్ ద్వారా సంప్రదించడంతో వారి ఆచూకీ తెలియకపోవడంతో మోసపోయామని తెలుసుకుని శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బయలు వీరభద్రస్వామికి విశేష పూజ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి శుక్రవారం అమావాస్య సందర్బంగా విశేషార్చన జరిపించారు. అమావాస్య రోజున భక్తులు పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి 30 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా ఈ విశేష పూజను జరిపించుకున్నారు. స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని పండితులు తెలిపారు.


