పీపీపీ వద్దంటూ రోడ్డు దిగ్బంధం
ఆదోని రూరల్: పీపీపీ విధానంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వద్దంటూ గురువారం ఆదోని మెడికల్ కళాశాల వద్ద రోడ్డుపై ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ.. పీపీపీ విధానంతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని, సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందబోదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండాల్సిన వైద్య విద్యను లాభాల కేంద్రంగా మార్చే ప్రయత్నాన్ని మార్చుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.సుదర్శన్, విరుపాక్షి, పంపన్నగౌడ్, భాస్కర్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వ వైద్య విద్యకు శాపంగా మారిన జీవో నంబర్ 107, 108, 590లను వెంటనే రద్దు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.తిమ్మయ్య డిమాండ్ చేశారు.
పోలీసులతో వాగ్వాదం
ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు అక్కడికి చేరుకుని ప్రజా సంఘాల నాయకులతో వారించే ప్రయత్నం చేశారు. ధర్నా చేస్తున్న వారిలో కొందరని పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో ప్రజా సంఘాల నాయకులు, ఎస్‌ఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.షాబీర్‌బాషా, సీపీఐ మండల కార్యదర్శి రాజు, సీపీఐ పట్ణణ సహకార కార్యదర్శి రమేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి బసాపురం గోపాల్, ప్రజా సంఘాల నాయకులు విజయ్, శ్రీకాంత్, దస్తగిరి, శేఖర్ పాల్గొన్నారు.


