భరత్ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా!
ఉద్యోగులపై ఎందుకంత కక్ష
నగరానికి గుండెకాయ తరహా స్థలంపై
చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’
చేస్తోంది. శివారు ప్రాంతంలో వేలాది
ఎకరాల భూములున్నా స్వార్థంతో ఉన్న
ఉద్యోగులపై కక్షకట్టింది. ఇప్పటికిప్పుడు అదే ప్రాంతంలో కట్టాలని భీష్మిస్తున్న తీరు చూస్తే ఆ స్థలంతో తమ పబ్బం గడుపుకోవాలనే ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఉద్యోగులు.. పిల్లల చదువులు మధ్య ఉండటం.. కొందరు ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటం.. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి టీజీ భరత్ ‘కర్ర’పెత్తనం చేస్తుండటం.. అందుకు జిల్లా అధికారయంత్రాంగం వత్తాసు పలుకుతుండటం ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తోంది.
కర్నూలు(సెంట్రల్): కర్నూలు రాజధానిగా ఏర్పాటైన 1953 ప్రాంతంలో ఉన్నతాధికారుల కోసం ఏ, బీ, సీ విభాగాల్లో 1,009 క్వార్టర్స్‌ను నిర్మించారు. అయితే కాలంతోపాటు కట్టిన భవనాల ఆయుష్షు కూడా తగ్గిపోవడంతో కొన్ని భవనాలు బాగున్నా, మరికొన్ని పాడుబడ్డాయి. ఈ క్రమంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా అక్కడ మినీ స్టేడియం కట్టే పేరిట స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే నగరం నడిబొడ్డున స్టేడియం కడితే ట్రాఫిక్ సమస్య వస్తుందనే విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ మంత్రి టీజీ భరత్ మరో ప్రతిపాదనగా హైకోర్టు బెంచ్ తెరపైకి వచ్చింది. ఈ సారి అధికారిక, అనధికారికంగా నివాసం ఉంటున్న అందరూ ఖాళీ చేయాల్సిందేనని ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే కర్రలు పట్టుకునైనా బలవంతంగా బయటకు పంపాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటైనా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా అన్న ప్రశ్నలు ఉద్యోగులు, ప్రజల నుంచి వ్యక్తమవుతున్నా మంత్రి పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
జగన్నాథ గట్టులో
దాదాపు 1000 ఎకరాల భూమి
హైకోర్టు బెంచ్ ఏర్పాటులో భాగంగా రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేయాలని ఉద్యోగులను వేధిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కనీసం 2026 ఏప్రిల్ వరకు సమయం కావాలని కోరుతున్న పట్టించుకోని పరిస్థితి. అప్పటి వరకు సమయమిస్తే తమ పిల్లల చదువులు, ఉద్యోగ ప్రదేశాలకు అనువుగా ఇళ్లు చూసుకుంటామని చెబుతున్నా మంత్రి టీజీ భరత్, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గత ప్రభుత్వ హయాంలో జగన్నాథగట్టులో దాదాపు 1000 ఎకరాల భూమిని లా యూనివర్సిటీ, హైకోర్టు భవనాల కోసం కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మంత్రి మొండి పట్టు వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే నగరం మరింత విస్తరించి అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి మాటే జీవోనా..
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ఏ, బీ, సీ క్వార్టర్లు ఖాళీ చేయకపోతే కర్ర తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడంపై అక్కడ నివాసం ఉంటున్న ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన చెబితే తమను ఎలా ఖాళీ చేయించేందుకు సిద్ధమవుతున్నారని ఉద్యోగులు ఉన్నతాధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు టీజీ భరత్ చెబితే క్వార్టర్లను ఖాళీ చేయిస్తున్నారా? లేదంటే ప్రభుత్వం నిర్ణయించిందా? అనే విషయం స్పష్టం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయమైతే అందుకు సంబంధించిన జీఓ, సర్క్యులర్ ఏమైనా ఇచ్చారా? ఉంటే ప్రతిని అందజేయాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ఓ లేఖ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ వేతనాల్లో హెచ్‌ఆర్‌ఏ కట్ అవుతోందని, అలాంటప్పుడు ఇప్పటికప్పుడు ఖాళీ చేయమంటే ఎలాగని కన్నీరుమున్నీరవుతున్నారు. బలవంతంగా తమ ఇళ్లకు కరెంట్, వాటర్ కనెక్షన్లు తొలగిస్తున్నారని, ఇలా చేయడం జీవించే హక్కును కాలరాయడమేనంటున్నారు.
ఏ, బీ, సీ క్వార్టర్స్‌లోనే
హైకోర్టు బెంచ్ ఎందుకు..
అధికారిక ఉత్తర్వులు వస్తే
ప్రజల ముందుంచండి
రాత్రికి రాత్రి ఖాళీ చేయమనడం
అన్యాయం
ప్రతినెలా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్నా
వేధింపులు తగవు
జగన్నాథగట్టులో కట్టుకోవడంలో
అభ్యంతరమేంటి
ఆవేదన వ్యక్తం చేస్తున్న
నివాసిత ఉద్యోగులు
కర్నూలులో ఏ, బీ, సీ క్వార్టర్ల నివాసితులు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే. లేకుంటే కర్రతో సమాధానం చెబుతాం. రెండు వారాల వ్యవధిలోనే కర్నూలు హైకోర్టు బెంచీకి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ప్రతిపక్ష పార్టీని కలిస్తే మీకే వేళ్లు, చేతులు కాలుతాయి. రచ్చ చేయాలని చూస్తే కుదరదు. ఇక్కడ ఉండేది టీడీపీ ప్రభుత్వం, కర్రతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
– ఈనెల 24న మంత్రి టీజీ భరత్ హెచ్చరిక
భరత్ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా!
భరత్ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా!


