నియోజకవర్గానికో రైతుబజార్
కర్నూలు(అగ్రికల్చర్): నియోజకవర్గానికి ఒక రైతుబజారు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని ఆదేశించారు. రైతుబజారు ఏర్పాటుకు నియోజకవర్గం కేంద్రంలో కనీసం అర్ధ ఎకరా నుంచి ఎకరా భూమి గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు కర్నూలు, ఆదోనిలో మాత్రమే రైతుబజార్లు నిర్వహిస్తున్నారు. కల్లూరు గోవర్ధన్‌నగర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతుబజార్ నిర్మించింది. అయితే ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రైతుబజారుకు భూమిని ఎంపిక చేశారు. ఇందులో రైతుబజారు నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేట్లు వేస్తున్నారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో రైతుబజార్ల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరులో భూమిని గుర్తించనున్నారు.
ఆకతాయిలకు కౌన్సెలింగ్
కర్నూలు: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఆకతాయిలు ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు గురువారం జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీల సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని.. లేదా డయల్ 112, 100కు సమాచారం అందించాలని విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలలతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాల వద్ద పోలీసులు బృందాలుగా నిఘా ఉంచారు. మఫ్టీలో అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఎస్‌ఆర్‌ల పరిశీలన
కర్నూలు (అర్బన్): జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు సంబంధించి గురువారం సాయంత్రం సర్వీసు రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లాలో 54 మంది గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, వేర్వేరు గ్రామ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి లభించనుంది. ఈ నేపథ్యంలో పదోన్నతి పొందనున్న వారి సర్వీసు రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు వారికి ఎక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్, కార్యాలయ పరిపాలన అధికారిణి గీతాప్రతిమ పాల్గొన్నారు.
నియోజకవర్గానికో రైతుబజార్


