కొండలు ఎక్కేసి.. క్షీర సాగరం ఈదేస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): పర్వతాలను అధిరోహించడంలో అతను దిట్ట... ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్ద పర్వతమైన కిలిమంజారోను అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. ఆ తర్వాత భారత దేశంలో అతి పెద్ద పర్వతమైన కాంచనగంగను అధిరోహించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది ప్రధాన లక్ష్యమైనప్పటికీ పదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించకపోవడంతో సాధ్యపడలేదు. పర్వతారోహణలో నేర్పరి అయిన యువకుడు నేడు ఏ2 పాల ఉత్పత్తిలో విశేషంగా రాణిస్తున్నాడు. డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన మూలింటి అల్లాబకాష్ హెచ్‌ఎఫ్ ఆవులతో డెయిరీఫామ్ ఏర్పాటు చేసుకొని ఏ2 పాలు ఉత్పత్తిలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2023లో దేశీవాలి హెచ్‌ఎఫ్ ఆవులతో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని ప్రగతి పథంలో పయనిస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు ఎంపికై మెడికల్ టెస్ట్ వరకు వెళ్లినా కంటి సమస్య వల్ల వెనుదిరిగాడు. అయినా నిరాశ చెందకుండా దేశీవాలి ఆవులతో డెయిరీఫామ్ ఏర్పాటు చేసుకొని రాణిస్తుండటం విశేషం. రెండేళ్ల క్రితం తొలుత చిన్న షెడ్ ఏర్పాటు చేసుకొని రెండు హెచ్‌ఎఫ్ ఆవులతో మొదలు పెట్టిన యువకుడు 22 ఆవులతో పాల ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రోజుకు 150 లీటర్ల పాల ఉత్పత్తి..
మొత్తం ఆవుల్లో పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ప్రతి నెల 2 ఆవులు ఈతకు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందుకున్నారు. పచ్చి మేతతో పాటు పోషక విలువలు కలిగిన దాణా తదితర వాటిని వినియోగిస్తుండటం వల్ల రోజుకు 150 లీటర్ల ఏ2 పాలు ఉత్పత్తి అవుతాయి. దేశీ వాలీ ఆవు పాలల్లో ఏ2 ప్రొటీన్ ఉంటుంది. ఏ2 పాలకు పట్టణ ప్రాంతాల్లో విశేషమైన డిమాండ్ ఉంటుంది. ఏ2 పాలను పట్టణ ప్రాంతాల్లో లీటరు రూ.100 ఆపైన ధరతో విక్రయిస్తున్నారు. అల్లాబకాష్ గ్రామీణ ప్రాంతంలో డెయిరీ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ అంత ధరతో కొనేవారు లేకపోవడంతో స్థానిక డెయిరీకే లీటరు పాలను రూ.38 ప్రకారం పోస్తున్నారు. ఈ ప్రకారమే పాల ఉత్పత్తి ద్వారా ఆయన నెలకు అన్ని రకాల ఖర్చులు పోగా... నికరాదాయం రూ.1.20 లక్షలు పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో విక్రయించుకుంటే రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది.
హెచ్‌ఎఫ్ ఆవులతో ఏర్పాటు చేసుకున్న డెయిరీ పామ్ సంతృప్తికరంగా ఉంది. ఇంటిల్లిపాది డెయిరీ నిర్వహణపైనే ఉంటున్నాం. 100 ఆవులకు సరిపడే విధంగా ఫామ్‌ను విస్తరించుకున్నాం. ప్రస్తుతం ఫామ్‌లో 22 ఆవులు ఉన్నాయి. డెయిరీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరు ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలను అభివృద్ధి చేసుకున్నాం. ఎన్ని పర్వతాలు ఎక్కినా లభించని సంతృప్తి ఏ2 పాల ఉత్పత్తి ద్వారా లభిస్తోంది.
– అల్లాబకాష్, పాడిరైతు
కాఫ్ ఏ ఇయర్ పాటిస్తూ..
పాడిపరిశ్రమ వైపు అడుగులు వేసిన అల్లాకాష్ ముందుగా పలు అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. పాలదిగుబడి తగ్గిపోకుండా.. అదే క్రమంలో ఆవుల సంఖ్యను పెంచే విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కృతిమ గర్భధారణ ద్వారా ఆడదూడలు పుట్టే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాఫ్ ఏ ఇయర్ రూల్‌ను పాటిస్తున్నాడు. తనకు ఆరు ఎకరాల భూమిని కేవలం ఆవులకు అవసరమైన పశుగ్రాసాల సాగు మాత్రమే చేపడుతుండటం విశేషం. పచ్చి మేత కోసం సూపర్ నేపియర్, 4జీ బుల్లెట్, గరుడ నేపియర్ రకాలను సాగు చేస్తున్నాడు. పచ్చి మేత దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చాఫ్ కట్టర్ కూడా వినియోగిస్తున్నాడు. ఆవుల నుంచి పాలు తీయడానికి మిల్క్ మిషన్‌లు కూడా వినియోగిస్తున్నాడు. హెచ్‌ఎఫ్ ఆవులతో ఏర్పాటు చేసుకున్న డెయిరీ ఫామ్‌ను డోన్ ఏరియా హాస్పిటల్ సహాయ సంచాలకులు డాక్టర్ నాగరాజు సందర్శించి తగిన సూచనలు ఇస్తున్నారు.
డెయిరీ పామ్‌లో రాణిస్తున్న
పర్వతారోహకుడు
22 హెచ్‌ఎఫ్ ఆవులతో
ఏ2 పాల ఉత్పత్తి
ఆరు ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాభివృద్ధి
నెలకు నికరాదాయం
రూ.1.20 లక్షలుపైనే
కొండలు ఎక్కేసి.. క్షీర సాగరం ఈదేస్తూ!


