బాబూ.. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేయలేం!
● ఉద్యోగానికి వర్క్ ఇన్‌స్పెక్టర్
రాజీనామా?
కర్నూలు(టౌన్): ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో కొంత మంది ఉద్యోగులు సెలవుల్లో వెళ్లారు. తాజాగా గురువారం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసే వై.ప్రవీణ్ (సీఎఫ్‌ఎంఎస్ ఐడీ: 1008159013, ఏపీసిఓఎస్ ఐఛిఠీ : 109160152 ) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పదేళ్లుగా ఆయన చక్కగా విదులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలలుగా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆవేదన ఇదీ..
నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ముఖ్యమైన అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఈఈ గంగాధర్ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లిపోయారు. అలాగే అసిస్టెంట్ ఇంజినీర్ వైష్ణవి సెలవుల్లో ఉన్నారు. వరుస సెలవుల్లో వెళ్లిపోవడానికి ఉన్నతాధికారుల వ్యవహర శైలినే ప్రధాన కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది నెలల వ్యవధిలో పదవీ విరమణ పొందనున్న ఓ అధికారి తనకేమి సంబంధం లేన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు సైతం అదనపు బాధ్యతలను భరించలేక సెలవుల్లో వెళ్లి పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. క్షేత్రంలో ఉన్న సమయంలో సమీక్షలకు రావాలని, కార్యాలయంలో ఉంటే క్షేత్రానికి రావాలని వేధిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వార్డు సచివాలయాల ఉద్యోగులు సైతం మూకుమ్మడిగా సెలవుల్లో వెళ్లిపోయేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆనంతపురంలో పనిచేస్తున్న ఈఈ రమణమూర్తికి ఎస్‌ఈగా ఇన్‌చార్జీ ఉత్తర్వులు ఈ వారంలో రానున్నాయని సమాచారం. ఇందుకు ఓ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


