నలుగురు విద్యార్థుల డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ, ఎంపీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో చూచిరాతలకు పాల్పడ్డ నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా గురువారం బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 3,709 మందికి 3,483 మంది, బీపీఈడీ పరీక్షలకు 159 మందికి 142 మంది, ఎంపీఈడీ పరీక్షలకు 104 మందికి 95 మంది హాజరయ్యారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, కోవెలకుంట్ల ఎస్‌వీబీ డిగ్రీ కళాశాలలో ఒకరు చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో..
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పింఛన్లకు నిధులు విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.196.71 కోట్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.104.32 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.92.39 కోట్లు మంజారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిధులు ఈ నెల 29న బ్యాంకులకు విడుదలవుతాయి. అదే రోజున వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్పేర్ అసిస్టెంట్లు డ్రా చేస్తారు. డిసెంబర్ 1న పంపిణీ చేయనున్నారు.
పంప్‌మోడ్‌తో 6,031
క్యూసెక్కుల నీటి మళ్లింపు
శ్రీశైలం ప్రాజెక్ట్: ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం పంప్‌మోడ్ ఆపరేషన్‌తో 6,031 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయంలోకి మళ్లించారు. మిగులు విద్యుత్‌ను వినియోగించుకుని రివర్స్‌బుల్ సిస్టంతో డ్యాం ముందు భాగంలో ఉన్న నీటిని జలాశంలోకి తరలించారు. బుధవారం నుంచి గురువారం వరకు జలాశయానికి 9,738 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 14,946 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.909 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 8,514 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,832 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం సమయానికి జలాశయంలో 202.0439 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది.
జనవరి 29, 30 తేదీల్లో జాతీయ సదస్సు
శ్రీశైలంప్రాజెక్ట్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనవరి 29, 30వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హుస్సేన్‌బాషా తెలిపారు. కళాశాలలో బుధవారం బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల వాణిజ్య విభాగం, న్యూఢిల్లీకి చెందిన ఐసీఎస్‌ఎస్‌ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. పత్రాల సమర్పణను జనవరి 10లోగా ధ్రువీకరణ ఇవ్వాలన్నారు.


