క్రీడా పోటీల్లో ‘విభిన్న’ ప్రతిభ
మారిన జీవన శైలితో పట్టణాల్లో ప్రజలు ఒక కిలోమీటరు కూడా నడవని దుస్థితి నెలకొంది. ఆటోల్లో, వాహనాల్లో వెళ్లేవారు ఎక్కువ అయ్యాయి. వీరి ధీటుగా విభిన్న ప్రతిభావంతులు రన్నింగ్ రేస్‌లో, వీల్‌చైర్ పోటీల్లో ప్రతిభను చూపి ఆశ్చర్యానికి గురిచేశారు. నంద్యాల పట్టణంలోని నవజీవన్ క్రీడా మైదానంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను నిర్వహించారు. వాలీబాల్, షాట్‌పుట్, షటిల్ బ్యాడ్మింటన్, పరుగు పందెం, షాట్‌పుట్ వంటి పోటీల్లో విభిన్న ప్రతిభా వంతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు డిసెంబర్ 3న నంద్యాల పట్టణంలోని టౌన్‌హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు, మాజీ ఐఎంఏ అధ్యక్షుడు రవికృష్ణ తెలిపారు. జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణయ్య, కరస్పాండెంట్ సిస్టర్ జాన్‌మేరి, ఫాదర్ మర్రెడ్డి, పద్మా, పీఈటీలు సుంకన్న, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
– నంద్యాల(న్యూటౌన్)
క్రీడా పోటీల్లో ‘విభిన్న’ ప్రతిభ


