దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు వంద శాతం సబ్సిడీతో అందించనున్న రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల దరఖాస్తుకు ఈ నెల 30వ తేది వరకు గడువు పొడిగించినట్లు విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రయిస్ ఫాతిమా తెలిపారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులు అధికారిక వెబ్‌సైట్ www.apdarcac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇద్దరు విద్యార్థులు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా బుధవారం 8,785 మందికి 7,975 మంది హాజరు కాగా 810 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 91 శాతం హాజరు నమోదైందన్నారు. ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు చూచి రాతకు పాల్పడగా వారిని డిబార్ చేశామన్నారు.
ఏపీసీ బాధ్యతలు స్వీకరణ
కర్నూలు సిటీ: సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎన్.బి.లోకరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రెగ్యులర్ ఏపీసీ లేకపోవడంతో సుమారుగా ఏడు నెలలుగా డీఈఓ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ స్థానంలో డిప్యూటేషన్‌పై వచ్చేందుకు ఇద్దరు, ముగ్గురు అధికారులు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు డోన్ జీవీఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేస్తున్న డాక్టర్ ఎన్.బి.లోకరాజును ఈ నెల 20న కర్నూలు ఏపీసీగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆఫీస్ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం
శ్రీశైలం టెంపుల్: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం దేవస్థానం మల్లికార్జున కల్యాణ మండపంలో సమీక్షా సమావేశ మందిరంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. గతంలోనూ ప్లాస్టిక్ నిషేధంపై పలుమార్లు అవగాహన సమావేశాలు నిర్వహించామన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయాలను సూచించామన్నారు. సత్రాలు, దుకాణదారులు, హోటల్ నిర్వాహకులు విడివిడిగా రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేసుకుని తడి చెత్త, పొడిచెత్తను వేరువేరు కుండీలలో వేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి దేవస్థానం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. దేవస్థానం రెవెన్యూ, భద్రతా అధికారులు విస్త్రత తనిఖీలు చేపడతారని, నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం కూడా విధిస్తామన్నారు.
మద్దతు ధర చట్టం చేయాలి
కర్నూలు(సెంట్రల్): ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులకు చేస్తున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆర్‌ఎస్ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఎస్.మునెప్ప, ఎండీ అంజిబాబు మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో 13 గంటల పని విధానం వచ్చిందన్నారు. చంద్రబా బు ప్రభుత్వం మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ లేబర్ కోడ్‌లను అమలు చేయడం దారుణమన్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, రాముడు, పీఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పెంపు


