జగనన్న ఇళ్లకు పన్నులు!
● వసూలుకు అధికారుల ఏర్పాట్లు
● మౌలిక సదుపాయాలు లేక
ప్రజల అవస్థలు
పాణ్యం: పేదల ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. జగనన్న కాలనీలను నిర్మించింది. పలు సౌకర్యాలు కల్పించింది. పేదలు ఇళ్లు కట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీలను నిర్లక్ష్యం చేసింది. కనీస సౌకర్యాలు కల్పించే విషయంలోనూ కక్ష సాధింపు ధోరణి అవలంబించింది. ప్రజల వినతులతో అధికారులు ఎట్టకేలకు పన్ను వసూలుకు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియ ప్రారంభమైతే కనీస సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఊరుగా మారిన జగనన్న కాలనీ..
మండల కేంద్రమైన పాణ్యంలోని మేకల బండి(జగనన్న కాలనీ)లో 2019–22 మధ్య కాలంలో 439 మంది పాణ్యం ప్రజలకు, 20 మంది బలపనూరు పంచాయతీ వారికి కలిపి మొత్తం 459 మందికి బీఎల్‌సీ బేనిఫిసరీ లీడ్ కన్‌స్ట్రక్చన్ (యూడీఏ)కింద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీరు ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని రకాల మూడి సరుకు(ఇసుక, కడ్డీలు, సిమెంట్, ఎలక్ట్రిక్ వస్తులు, మరుగుదొడ్డి కావాల్సిన పరికరాలు, కిటికీల వస్తువులు)రాయితీపై అందించింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగాయి. ప్రస్తుతం హౌసింగ్ అధికారుల లెక్కల ప్రకారం 111 మంది ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా, 264 వివిధ దశలో ఉన్నాయి. మొత్తం 64 మంది ఇంకా నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం జగనన్న కాలనీ కొత్త ఊరులా తయారైంది.
ఇవీ ఇబ్బందులు..
జగనన్న కాలనీ రూపుదిద్దుకుంటున్న సమయంలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నివాసితులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చిన ప్రజలు సైతం చుక్కలు చూస్తున్నారు. గతంలోనే రోడ్డు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించగా.. ఇప్పుడు వీధిలైట్లు, ప్రధానరోడ్ల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వర్షాకాలం, రాత్రి సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు పలు సార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మేకలబండలో ఇళ్లు నిర్మించుకున్న వారికీ పంచాయతీ తరఫున పన్ను వసూలు చేస్తాం. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి నుంచి పన్ను వసూలు చేయాలని సూచించడంతో త్వరలోనే ప్రక్రియ మొదలు పెడతాం. ఇంటి నంబర్లు కేటాయించే పని ప్రారంభిస్తాం. పంచాయతీ తరఫున కాలనీ ప్రజలకు అందాల్సిన సేవలను అందిస్తాం.
– ఆనందరావు, ఈఓ, పాణ్యం పంచాయతీ


