ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి
ఓర్వకల్లు: సమాజంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని ఉయ్యాలవాడలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం దేశ ప్రజలకు అత్యున్నత గ్రంథమన్నారు. అందులో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి పౌరుడు గౌరవించి ఆచరించాలన్నారు. అనంతరం ఆమె ఉయ్యాలవాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాజకుమారి పొలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా తక్కువ వ్యయంతో అధిక లాభాలు ఆర్జిస్తున్న మహిళా రైతును కలెక్టర్ అభినందించారు. అనంతరం మొక్కజొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి హేమంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయాధికారి మాధురి, ఎంపీడీఓ నాగ అనసూయ, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


