శుభకార్యాలకు విరామం!
● ఫిబ్రవరి 17 వరకు మౌఢ్యమి
● 83 రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్
కొలిమిగుండ్ల: శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. నేటి నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు దాదాపు 83 రోజులు శుక్రమూఢం కొనసాగనుంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, యజ్ఞాలు,కొత్త వ్యాపారాల ప్రారంభం తదితర పనులు చేయకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. మౌఢ్యమి సమయంలో ఈరెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి. అందుకే శుభకార్యాలు జరుపుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
బోసిపోనున్న ఫంక్షన్ హాళ్లు
శుక్ర మౌఢ్యమి కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడటంతో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బోసిపోనున్నాయి. శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు, డెకరేషన్, సప్లయి సామగ్రి నిర్వాహకులు, వంట మాస్టర్లు, బాజా భజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నర నెలల పాటు ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది.
శుభకార్యాలకు విరామం!


