‘కారుణ్య’ం కోసం కార్మికుల ఆగ్రహం
● ఎమ్మిగనూరు మున్సిపల్
కార్యాలయం ముట్టడి
ఎమ్మిగనూరుటౌన్: విధి నిర్వహణలో మున్సిపల్ కార్మికులు మృతి చెందారని, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కౌన్సిల్ హాల్ ముందు మృతుల కుటుంబ సభ్యులు బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కౌన్సిల్ ముగిసిన తరువాత అధికారులు, సభ్యులు బయటికి రాకుండా డోర్‌ముందు కూర్చొని అడ్డుకున్నారు. ఏఎస్‌ఐ కిష్టప్పతో పాటు పోలీసులు సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్నతో పాటు పలువురుని ఎత్తుకెళ్లి కార్యాలయం బయట వదిలారు. కార్మికుల కుటుంబ సభ్యులు, కార్మిక సంఘ నాయకులతో కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడారు. మృతి చెందిన కార్మికులు ఔట్‌సోర్సింగ్ కింద నియమితులైన వారని, అనర్హులని ఉన్నతాధికారులు తెలిపారన్నారు. మానవతాదృక్పథంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి స్పందించి వారికి న్యాయం చేసేందుకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మలరామానాయుడు ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియకు కనీసం పది రోజులు అవుతుందని కమిషనర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.


