కౌలుదారులకు అన్నదాత సుఖీభవ లేనట్లే..
మొదటి విడతలో 2,72,757 మంది రైతులకు లబ్ధి
తామూ అర్హులమేనని గ్రీవెన్స్‌ను ఆశ్రయించిన 22,500 మంది రైతులు
వీటన్నింటినీ బుట్టదాఖలు చేసిన ప్రభుత్వం
వైఎస్‌ఆర్‌సీపీ హయాంతో పోలిస్తే 21,841 మంది రైతులకు మొండిచేయి
కౌలుదారులకు ఈ విడతలోనూ దక్కని ఊరట
పీఎం కిసాన్‌లో సైతం భారీగా కోత
నేడు ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్’ నిధుల విడుదల
కొత్త రైతులకు అందని సాయం
మాకు ఎలాంటి సొంత భూమి లేదు. ఈ ఏడాది నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాము. ప్రభుత్వం సీసీఆర్ కార్డు కూడా మంజూరు చేసింది. ఈసారి వ్యవసాయం కలసిరాలేదు. నష్టాలు మూటగట్టుకున్నాము. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వలేదు. కౌలుదారులకు ప్రభుత్వం నుంచి చేయూత కరువు అయింది.
– పల్లెపాడు పెద్ద వెంకటస్వామి, గుడిపాడు, గూడూరు మండలం
మాకు సొంతంగా ఒక్క సెంటుపొలం కూడా లేదు. ఏటా కౌలుకు భూములు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఎకరా కౌలుకు తీసుకుని ఉల్లిగడ్డలు సాగు చేశాను. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సీసీఆర్ కార్డు కూడా ఇచ్చారు. ఇటీవల అధిక వర్షాలతో పంట మొత్తం దెబ్బతినింది. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కూడా అందలేదు.
– ముక్తార్ బాషా, రామళ్లకోట, వెల్దుర్తి మండలం
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవ రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024–25లో సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2025–26లో మొదటి విడత పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది ఆగస్టు 2న విడుదల చేశారు. మొదటి విడతలో 2,72,757 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఆ తర్వాత మాకు అన్ని అర్హతలు ఉన్నాయి.. అయితే సాయం అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ మేరకు ప్రభుత్వం 22,500 మంది రైతుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించింది. ఈ నెల 19న రెండవ విడత అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. గ్రీవెన్స్‌తో పాటు కొత్త రైతులతో కలిపి రెండో విడతలో రైతుల సంఖ్య పెరగాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. మొదటి విడత జాబితానే ఇప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోవడం చూస్తే వేలాది మంది రైతులకు ఈ విడత కూడా నిరాశ తప్పని పరిస్థితి.
13,093 మంది రైతులకు
పీఎం కిసాన్‌లో కోత
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల ప్రకారం రైతులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తోంది. ప్రస్తుతం 21వ విడత సాయాన్ని కేంద్రం విడుదల చేస్తోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత పెట్టుబడి సాయం ఆగస్టు 2న విడుదలైంది. ఈ నెల 19న రెండో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. మొదటి విడతతో పోలిస్తే ప్రస్తుతం లబ్ధిపొందే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొదటి విడత విడతలో 2,38,693 మంది రైతులకు రూ.47.73 కోట్ల విడుదలయ్యాయి. తాజాగా 13,093 మంది రైతులు పీఎం కిసాన్‌కు దూరమయ్యారు.
చంద్రబాబు రెండు నాల్కల ధోరణి
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్‌ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 2,72,757 రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయాన్ని పరిమితం చేసింది. అన్నదాత సుఖీభవ కింద రూ.136.38 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.45.12 కోట్లు ప్రకారం రూ.181.36 కోట్లు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేల ప్రకారం విడుదల చేయనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో వైఎసార్ రైతుభరోసా కింద లబ్ధిపొందిన రైతులతో పోలిస్తే 21,841 మంది రైతులకు మొండిచేయి చూపడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడిసాయం రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తుండటం గమనార్హం. కటుంబంలో ఎంతమందికి భూములు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని రైతులను మభ్యపెట్టి ఇప్పుడు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది.
అన్నదాత సుఖీభవలో అర్హులకు అన్యాయం
ఐదేళ్లలో వేలాది మంది కొత్త రైతులు ఉత్పన్నమయ్యారు.
భూములను కొనుగోలు చేయడం ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయ్యాయి.
అయితే కొత్త రైతులకు పీఎం కిసాన్ సాయం అందడం లేదు.
2019 ఫిబ్రవరి 1లోపు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం అందుతోంది.
ఉన్న రైతుల్లో వేలాది మందికి ఈ–కేవైసీ చేయించుకోలేదని, బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కాలేదనే కారణాలతో లబ్ధికి దూరం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం కౌలురైతులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంటు భూములు, అటవీ భూముల (ఆర్‌వోఎఫ్‌ఆర్) రైతులకు తీరని అన్యాయం చేసింది. మొదటి విడతలో కేవలం భూ యజమానులకు మాత్రమే అన్నదాత సుఖీభవ దక్కింది. రెండవ విడతలోనూ వీరి ఆశలు ఆవిరయ్యాయి. మొదటి విడతలో లబ్ధిపొందిన రైతులకు మాత్రమే రెండవ విడతలోనూ పెట్టుబడిసాయం దక్కుతుండటాన్ని పరిశీలిస్తే కౌలుదారులకు, అసైన్డ్ రైతులందరికీ చంద్రబాబు సర్కార్ మొండిచేయి చూపినట్లయింది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్‌సీ కార్డులు జారీ అయ్యాయి. వీరంతా సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌలుదారులకు అన్నదాత సుఖీభవ లేనట్లే..
కౌలుదారులకు అన్నదాత సుఖీభవ లేనట్లే..


