పరాకాష్టకు రెడ్‌బుక్ పాలన
● కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దుర్మార్గం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్) : రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పరాకాష్టకు చేరిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దుర్మార్గమని చెప్పారు. ఖాకీ చొక్కాలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రజల గొంతుకను నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అభిప్రాయాలకు గొంతు అధికార ప్రతినిధులు అని, అలాంటి వారిని మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. సీఐ మృతి కేసులో నిష్పాక్షిక విచారణ కోరడం నేరమా..దేశంలో ఎక్కడా లేని దుష్ట సంప్రదాయం మన రాష్ట్రంలో కూటమి నాయకులు శ్రీకారం చుట్టారన్నారు. టీడీపీ నాయకులు సతీష్ కుమార్‌ది హత్య అని ప్రచారం చేస్తుంటే .. ఏ ఆధారాలతో చెబుతున్నారని ప్రశ్నించినందుకు కారుమూరి వెంకటరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సతీస్‌ది హత్య అని కథనాలు ప్రసారం చేసిన ఎల్లోమీడియా చానళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజా కోర్టులో తగిన శిక్ష తప్పదన్నారు. తమ పార్టీకి చెందిన వారిని ఎంత మందిని అరెస్టు చేసినా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.


