ఉల్లికి మద్దతు ధర కల్పించండి
కోడుమూరు రూరల్/ గోనెగండ్ల: ‘కష్టపడి పండించిన ఉల్లికి ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. దీని నుంచి బయటపడేందుకు మద్దతు ధర కల్పించడంతో పాటు ఉల్లి నిల్వకు గోదాములు ఏర్పాటు చేయాల’ని సెంట్రల్ టీమ్ ఎదుట ఉల్లి రైతులు ఏకరువు పెట్టారు. ఉల్లి పంటపై అధ్యయనానికి జిల్లాకు వచ్చిన సెంట్రల్ టీం మంగళవారం కోడుమూరు మండలంలో ప్యాలకుర్తి, గోనెగండ్ల మండలంలో గోనెగండ్ల, గాజులదిన్నె గ్రామాల్లో పర్యటించారు. కేంద్ర ఉద్యాన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డా. బి.జె.బ్రహ్మ ఆధ్వర్యంలో సెంట్రల్ టీం సభ్యులు మనోజ్, రాజీవ్ కుమార్, హేమంగ భార్గవ్, శరణం ముందుగా ప్యాలకుర్తి గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏయే రకాల ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు?ఎకరాకు ఎంత వరకు ఖర్చు వస్తుంది? నిల్వ చేసుకునేందుకు అవకాశాలున్నాయా? ఎంత ధర ఇస్తే గిట్టుబాటు అవుతుంది.. ప్రభుత్వం నుంచి ఏమైనా సౌకర్యాలు కోరుకుంటున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుందని గతంలో క్వింటాల్ ఉల్లి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ధర పలికేదని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోయారు. ప్రభుత్వం కల్పించిన రూ.1200 మద్దతు ధర కూలీల ఖర్చులకే సరిపోతుందన్నారు. మంచి ధర కోసం ఉల్లిని నిల్వ చేసుకునేందుకు గోదాములు కూడా లేవని తెలిపారు. గాజులదిన్నె గ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేశానని, పెట్టుబడుల కింద రూ. 4 లక్షలు ఖర్చు చేస్తే మార్కెట్‌లో ధర లేదని గోనెగండ్లకు చెందిన కౌలు రైతు గొరవ మునెప్ప వాపోయారు. ఇప్పుడు పంటను దున్నేయాల్సి వస్తుందని అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ టీం వెంట జిల్లా ఉద్యానవన అధికారి రాజా క్రిష్ణారెడ్డి, సహాయ సంచాలకులు ఫిరోజ్‌ఖాన్, హార్టికల్చర్ ఆఫీసర్ మదన్‌మోహన్ ఉన్నారు.
సెంట్రల్ టీమ్ ఎదుట రైతులు ఏకరువు


