జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాలనా?
● చంద్రబాబు పాలన తీరుపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం ● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవనకొండలో కోటి సంతకాల సేకరణ
దేవనకొండ: ‘ఇప్పటికే పేదవాడి సంజీవిని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పొడిచారు. తాజాగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల పేదలకు ఉచిత వైద్యం దూరమై జబ్బు చేసినప్పుడు ఆస్తులు ఆమ్ముకోవాల్సి వస్తుంద’ని చంద్రబాబు ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. దేవనకొండ మండలంలోని తెర్నెకల్, నల్లచెలిమల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిందన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారన్నారు. నేడు చంద్రబాబు సర్కారు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందన్నారు. దీని కారణంగా పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. అభివృద్ధిపై కాకుండా ప్రైవేట్‌పరం చేయడంపై బాబు దృష్టి పెట్టారని విమర్శించారు. అనంతరం తెర్నెకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విధానాలతో పేదల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా వారికి చేసిన మేలు శూన్యమన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలను పీపీ విధానంలో తన బినామీలకు అప్పగించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బూత్ సంయుక్త కార్యదర్శి కొత్త కాపు మధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ రామకృష్ణ, సర్పంచ్ అరుణ్‌కుమార్, ఎంపీటీసీ నామాల శీను, వైఎస్సార్‌సీపీ శ్రేణులు బెల్లి ఈరన్న, తలారి దొడ్డప్ప, బడేసాబ్, హంపిరెడ్డి, లుమాంబ , జొన్నల అంజి పాల్గొన్నారు.


