ప్రజల కోసమే ‘కోటి’ ఉద్యమం
● ప్రభుత్వ వైద్య కళాశాలలను
ప్రెవేటీకరించొద్దు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర
అధికార ప్రతినిధి శ్యామల
కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పిలుపు తెలిపారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమె మాట్లాడుతూ.. అర్హులైన పేదలు, మధ్యతరగతి విద్యార్థినీ, విద్యార్థుల కోసం జగనన్న ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్య కళశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రెవేటీకరించేందుకు నిర్ణయించడం దుర్మార్గమన్నారు. వైద్యాన్ని ప్రెవేటుకు అప్పగిస్తే పేద రోగులకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. కూటమి సర్కార్ తక్షణం పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలోని నాయకులకు లబ్థి చేకూరేందుకు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ విధానాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కిషన్, కటారి సురేష్, బీసీ సెల్ అద్యక్షుడు రాఘవేంద్ర, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, నగర అధ్యక్షురాలు మంగమ్మ, రాష్ట్ర బీసీ సెల్ మహిళా నాయకులు భారతి, లీగల్ సెల్ నాయకులు ప్రభాకర్, రాజేష్ కుమార్, కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, జుబేర్, షేక్ అహమ్మద్, ఆర్షియా ఫర్హీన్, వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు, మహిళా విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


