కనుల పండువగా కర్నూలు ఉత్సవాలు
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు ఉత్సవాలు మూడో రోజు సోమవారం కనుల పండువగా జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ నాటకాలు నిర్వహించి రక్తి కట్టించారు. పోటీల్లో కళాకారులు వివిధ నాటకాలను, సన్నివేశాలను ప్రదర్శించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. గయోపాఖ్యానం యుద్ధ సీనుతో ప్రారంభమై భవాని, చింతామణి, శ్రీకృష్ణ తులాభారం, బాలనాగమ్మ వంటి నాటకాల్లోని వివిధ సన్నివేశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాలను ప్రారంభిస్తూ టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఏకాంకికలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డు చేసిందన్నారు. వరుసగా మూడోసారి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కన్వీనర్‌గా జీవీ శ్రీనివాస రెడ్డి, గాండ్ల లక్ష్మన్న, వాల్మీకి రాముడు వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ నాటకాలు, సన్నివేశాలను ప్రదర్శించిన కళాకారులను సత్కరించి అభినందించారు.


