
కూలీల వాహనాలు బోల్తా
20 మందికి గాయాలు
గడివేముల: మండల పరిధిలోని పెసరవాయి రస్తాలో అదుపుతప్పి ఓ బొలేరో వాహనం, ఆటో బోల్తా పడిన ఘటనలో దాదాపు 20 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. బండిఆత్మకూరు మండలం పెద్దదేవుళాపురం, భోజనం, మోత్కూరు గ్రామాల నుంచి ప్రతిరోజు దాదాపు 40 నుంచి 50 ఆటోల్లో గడివేముల మండలంలోని వివిధ గ్రామాలకు వ్యవసాయ పనులకు వస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయా గ్రామాల నుంచి బొలేరో వాహనం, ఆటో కూలను ఎక్కించుకుని గని గ్రామ పరిధిలోని పొలాలకు బయలుదేరాయి. పెసరవాయి రస్తాలోని ఘటనా స్థలం వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి పూర్తిగా ఒరిగిపోయింది. వెనక నుంచి వస్తున్న ఆటో కూడా వేగం అదుపుకాక బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దదేవుళాపురం గ్రామానికి చెంది న రాములక్క, కళావతి, మాధవి, పద్మావతి, బాలలక్ష్మమ్మ, రామేశ్వరి, దస్తగరి, భోజనం గ్రామానికి చెందిన దూదేకుల బజారమ్మ, నాగలక్ష్మమ్మ, సుభద్రమ్మతోపాటు మరో పదిమంది కూలీలకు గాయా లయ్యాయి. చుట్టుపక్కల పొలాల రైతులు స్పందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రతి రోజు పరిమితికిమించి వాహనాలు కూలీలకు ఎక్కించుకుని రాకపోకలు సాగిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డి ఆస్పత్రికి చే రుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

కూలీల వాహనాలు బోల్తా