
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోండి
కోవెలకుంట్ల: ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి సూచించారు. స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 57,299 హెక్టార్లలో పప్పుశనగ సాగు చేయాల్సి ఉండగా 11,950 క్వింటాళ్ల విత్తనాలు మంజూరయ్యాయన్నారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లోని ఆరు మండలాలకు 7,900 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించామన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.7,800 ధర నిర్ణయించగా 25 శాతం సబ్సిడీ పోనూ రైతులకు రూ. 5,850కు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుధాకర్, మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్ మధులత, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, సెక్రటరీ నారాయణస్వామి, వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గువ్వల సుబ్బారెడ్డి, మండల వ్యవసాయాధికారులు సుధాకర్‌రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, జ్యోతి, ఏఈఓలు రమణ, దివ్య పాల్గొన్నారు.