
ట‘మాట’ పడిపోయింది!
● కిలో రెండు రూపాయలతో కొనుగోలు
● అందని గిట్టుబాటు ధర
● తీవ్రంగా నష్టపోతున్న రైతులు
పత్తికొండ: టమాటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు ఉత్తివే అని తేలిపోయింది. వారు చెప్పిన మాటలకు మార్కెట్‌లో లభించే ధరకు పొంతన పొంతన లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు విని వ్యాపారులతో మాట్లాడి మూణ్ణాళ్ల ముచ్చటగా కొద్దిమేర ధరలు పెంచి టమాటాలను కోనుగొలు చేశారు. అనంతరం ధరలు తగ్గించి అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం పత్తికొండ మార్కెట్‌కు 61 టన్నుల టమాటను రైతులు తీసుకొచ్చారు. అయితే మార్కెట్‌లో కిలో రూ. 1 నుంచి రూ.2 ప్రకారమే కోనుగోలు చేశారు. 15 కేజీల జత గంపలను రూ. 80 నుంచి రూ. 120 లోపు, 25 కేజీల జత గంపలను రూ. 100 నుంచి రూ.200 లోపు కోనుగోలు చేశారు. గిట్టుబాటు ధర కోసం వారం రోజుల కిందట రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులు పాటు ఉన్నత స్థాయి అధికారులు మార్కెట్‌లో హడావిడి చేశారు. అప్పట్లో కిలో రూ. 6 నుంచి రూ. 8 లోపు కోనుగొలు చేశారు. అయితే శనివారం రోజు నుంచి ధరలు తగ్గించుకుంటూ వచ్చారు. సోమవారం ఉన్నట్టుండి కిలో రెండు రూపాయలలోపు కొన్నారు. మాట తప్పడంపై రైతులు మండిపతున్నారు. మార్కెట్‌కు వచ్చిన టమాటలో నాణ్యత లేదనడంలో వాస్తవం లేదని, వానల్లేక చాలా నాణ్యతగా ఉందని రైతులు చెబుతున్నారు. గిట్టుబాటు ధరతో ఎందుకు కొనడం లేదని ప్రశ్నిస్తున్నారు.
నిర్లక్ష్యం.. అలసత్వం
పత్తికొండ మార్కెట్‌ను వారం కిందట కడప రీజనల్ డైరక్టర్ లావణ్య, కర్నూలు ఎడీ అదినారాయణ సందర్శించారు. గిట్టుబాటు ధరపై రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో ధర తగ్గినప్పుడు గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కోనుగొలు చేస్తుందని హామీ ఇచ్చారు. అంతే కాదు ఆదనంగా ప్రత్యేక అధికారి పద్మావతితో పాటు ఆదోని, ఎమ్మిగనూర్ మార్కెట్‌యార్డుల నుంచి ఐదుగురు సిబ్బందిని కూడా నియమించారు. సిబ్బంది ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో ధర తగ్గితే తామే కోనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యధోరిణి, అధికారుల అలసత్వం రైతులకు శాపంగా మారింది.