
మోదీ పర్యటన ఏర్పాట్లు చకచక
● సున్నిపెంటలో ఆరు హెలిపాడ్‌లు సిద్ధం
● నల్లమలలో కొనసాగుతున్న
గ్రేహౌండ్స్ కూంబింగ్
శ్రీశైలంప్రాజెక్ట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన శ్రీశైలం పర్యటన సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, అటవీ, ఐటీడీఏ, దేవదాయ, కేంద్ర, రాష్ట్ర పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సున్నిపెంటలోని ఎకలాజికల్ పార్క్‌లో ఇప్పటికే శాశ్వత హెలిపాడ్‌లు మూడు ఉన్నాయి. ప్రధాని మోదీ వెంట మూడు హెలికాప్టర్లు వస్తుండడంతో ఆ హెలిపాడ్‌లను మరింత పటిష్ట పరుస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇతర మంత్రుల కోసం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మరో మూడు తాత్కాలిక హెలిపాడ్‌లను నిర్మిస్తున్నారు. విద్యుత్ లైన్ల కింద, ప్రధాన రహదారికి ఇరువైపుల చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఇంటలిజెన్స్, బాంబ్‌స్క్వాడ్, గ్రేహౌండ్స్ బలగాలు శ్రీశైలం పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాయి. ప్రధాని పర్యటన విధులకు వచ్చే అధికారులు, ఉద్యోగులకు సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సాధారణ ప్రయాణికుల రాకపోకలకు, సౌకర్యాలకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నందున అత్యవసరమైతే తప్ప భక్తులు, యాత్రికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మోదీ పర్యటన ఏర్పాట్లు చకచక