
ఎస్టీ జాబితాపై వాల్మీకులకు స్పష్టత ఇవ్వాలి
● వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు
కర్నూలు (టౌన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని 2017లో సీఎం చంద్రబాబు, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, వెంటనే స్పష్ట ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌సీపీ బీసీసెల్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్‌డీఏ ప్రభుత్వానికి, ఆ పార్టీలకు వాల్మీకులు గుర్తుకొస్తారన్నారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉందని వెంటనే వాల్మీకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈనెల 16న కర్నూలులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వాల్మీకులకు ఇచ్చిన హామీపై స్పష్టంగా ప్రకటించాలన్నారు. ఏళ్ల తరబడి వాల్మీకులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీసీల జపం చేసే చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. వాల్మీకులకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేసేందుకు సిద్ధమైందన్నారు. వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, యువజన విభాగం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ నాయుడు, వాల్మీకి యూత్ ప్రెసిడెంట్ నాయుడు, బండిమెట్ట మధు, అశోక్, లక్ష్మన్న, జగన్ పాల్గొన్నారు.