
ముల్లె సర్దుకున్నాం.. వెళ్లిపోతున్నాం!
కోసిగి: జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బతుకు తెరువు కోసం పిల్లా పాపలతో కలిసి మూటాముల్లె సర్దుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఖరీఫ్ సీజన్ ముగియక ముందే ఈ ఏడాది పనుల కోసం కూలీలు, రైతులు వలసబాట పట్టారు. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పంటలన్నీ పూర్తిగా దెబ్బతిని రైతులకు తీరని నష్టం మిగిలింది. ఏటా పనులు ముగించుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఈఏడాది ఖరీఫ్ పూర్తికాక ముందే కోసిగి, కౌతాళం మండలాల నుంచి పక్షం రోజులుగా వివిధ వాహనాల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు తరలి వెళ్లుతున్నారు. ఆదివారం కోసిగి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 30కి పైగా టెంపోల్లో 1500 మందికి పైగా కూలీలు తరలి వెళ్లారు. మండలంలోని కోసిగిలోని కొండుగానీ వీధి, కింద మారెమ్మ దేవి, నాగన్నగేరి, దుర్నిగేని, విద్యుత్ సబ్ స్టేషన్ సమీప కాలనీ, రామక్కమ్మ కాలనీల నుంచే కాక దుద్ది, చింతకుంట, పల్లెపాడు, కామన్‌దొడ్డి, పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు, పీకలబెట్ట, బాపుల దొడ్డి, కౌతాళం మండలంలోని మరళి, గుడింకబాలి, హాల్వి, తదితర గ్రామాల నుంచి తరలి వెళ్లారు. ఇందులో కొందురు కర్ణాటక రాష్ట్రంలోని సైదాపూర్, గబ్బూర్, మటమారి, మర్చటాల్ ప్రాంతాలకు తెలంగాణ ప్రాంతంలో పలు ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసుకుని బడికి వెళ్లే పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్లారు.
వలసలు ఎందుకంటే..
వలస వెళ్లిన ప్రాంతంలో పత్తి పొలాల్లో చిరు రైతులు, వ్యవసాయ కూలీలు పనులు చేసుకుని జీవనం సాగిస్తారు.ఒక్కొక్కరికి రోజుకు రూ.1000 కూలి లభిస్తుంది. తమ వెంట తీసుకెళ్లిన పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ పనులు చేస్తారు. ఉన్న ఊరిలో పనులు దొరకక పోగా కుటుంబ పోషణ భారం కావడంతో దూర ప్రాంతాలకు ప్రజలు వలస వెళ్తున్నారు. కొన్నాళ్ల పాటు పనులు చేసి డబ్బులు సంపాదించుకుని మళ్లీ గ్రామాలకు చేరుకుంటామని పలువురు కూలీలు తెలిపారు. వలస వెళ్లిన ప్రాంతాల్లో జీవనం దుర్భరంగా ఉంటుందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోను గూడారాలు వేసుకుని, మరికొన్ని ప్రాంతాల్లో పొలాల యజమానుల షెడ్‌లలో నివసిసస్తూ కాలం గడుపుతామని చెప్పారు.
మాకున్న ఇద్దరు కుమారులు బతుకు తెరువు కోసం భార్యలు, పిల్లలతో కలిసి పనుల కోసం తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. ప్రతి ఏటా మాకు ఇదే పరిస్థితి. మాకు చేతకాక పోవడంతో ఇళ్ల వద్ద కాపలా ఉన్నాం. పిల్లలు అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారంటూ ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాం. ఒక పూట తింటూ మరొక పూట పస్తులు ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఈ కష్టం ఎవరికీ రాకూడదు.
– హనుమయ్యగారి లసుమయ్య, సంజమ్మ, కోసిగి
పనుల్లేక వలసబాట పడుతున్న ప్రజలు
బడికి వెళ్లే పిల్లలను తమతో
తీసుకెళ్తున్న వైనం
ఇళ్లకు తాళాలు..
ఖాళీ అవుతున్న పల్లెలు
చర్యలు తీసుకోవడంలో
రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ముల్లె సర్దుకున్నాం.. వెళ్లిపోతున్నాం!

ముల్లె సర్దుకున్నాం.. వెళ్లిపోతున్నాం!

ముల్లె సర్దుకున్నాం.. వెళ్లిపోతున్నాం!