
కోటి సంతకాలతో ప్రభుత్వ కళ్లు తెరిపిస్తాం
కర్నూలు (టౌన్): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. పీపీపీ విధానాన్ని విరమించుకునేంత వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆదివారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి నేతల బినామీలకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలల నిర్మాణంలో భాగంగా వేలాది ఎకరాలు కేటాయించి ఒక్కొక్క బిల్డింగ్‌కు రూ.300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వాటిని ఎలా ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తారని ప్రశ్నించారు. దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించకూడదని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్వీ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రచ్చబండల వద్ద కోటి సంతకాల సేకరణ వచ్చే నెల 22 వరకు నిర్వహిస్తామన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం ఎలా అందిందో, సచివాలయాల వ్యవస్థ ఎలా పనిచేసిందో గ్రామ, మండల, నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అద్యక్షుడు రాఘవేంద్ర నాయుడు, కార్పొరేటర్ షాషా వలీ, పార్టీ నేతలు లాజరస్, వస్తాద్, నీలకంటూ, రాజశేఖర్, శ్రీను పాల్గొన్నారు.
పీపీపీ విధానాన్ని విరమించుకోవాలి
వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వమే
నిర్వహించాలి
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి